: హోంమంత్రి నాయిని... వాచ్ మెన్ కి ఎక్కువ, హోంగార్డ్ కు తక్కువ: టీడీపీ
మెట్రో కేంద్రంగా టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పక్షాల నేతలు ఏమాత్రం తీసిపోకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా, టీడీపీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి టీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెట్రోకు కేటాయించిన భూములను కేసీఆర్ తన బంధువు మైహోమ్స్ రామేశ్వరరావుకు అక్రమంగా కట్టబెట్టాడని రేవంత్ రెడ్డి ఆధారాలతో బయటపెట్టి బహిరంగ చర్చకు రమ్మని డిమాండ్ చేస్తే... టీఆర్ఎస్ నేతలు ఎందుకు ముందుకు రావడం లేదని టీటీడీపీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి ప్రశ్నించారు. అవినీతికి పాల్పడితే తన కుటుంబ సభ్యులనైనా వదలనన్న కేసీఆర్... రూ.2వేల కోట్ల విలువ చేసే భూములను తన బంధువుకు ఇచ్చిన దానిపై మాత్రం ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. ''కేసీఆర్, కేటీఆర్ ను చర్చకు రమ్మంటే... చెప్పులు మోసేటోళ్ళు, చెక్క భజన చేసోటోళ్ళు, లట్టుగాడు, పిట్టుగాడు ఎదురుదాడి చేస్తున్నారు. సింహంలా సింగిల్‌గా చర్చకు మేం వస్తామంటే... పందుల మందల్లాగా వందల కొద్దీ టీఆర్‌ఎస్ నేతలు చర్చకు వస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు'' అని విమర్శించారు. ''తెలంగాణ పైలెట్ కేసీఆర్ ఫామ్‌హోస్‌లో ఉంటే, కో-పైలెట్ కేటీఆర్ ఎక్కడ ఉన్నడు? ర్యాంప్ షోలలో ఉన్నాడా? పార్క్ హయత్ వంటి స్టార్ హోటల్స్‌లో తెలంగాణ అభివృద్ధి గురించి సెలబ్రిటీలతో లోతుగా చర్చిస్తున్నాడా?'' అని ఆయన అపహాస్యం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను తీవ్రంగా విమర్శించిన నాయిని నర్సింహారెడ్డిపై నర్సిరెడ్డి విరుచుకుపడ్డారు. నాయిని... జాతరలో పోతురాజు లాంటి వాడిని... తూటాలు లేని తుపాకీ లాంటి వాడని... వాచ్‌మెన్‌కు ఎక్కువ, హోంగార్డుకి తక్కువని విమర్శించారు. నాయిని, కల్లు కాంపౌండ్‌లో కౌంటర్ మీద కూర్చోడానికి పనికొస్తాడని, కేసీఆర్ కేబినెట్‌లో మొదటి డమ్మీ ఆయననేనని విమర్శించారు.