: దేశంలో నిబద్ధత గల ఉపాధ్యాయులు 20 శాతమే!: విప్రో ప్రేమ్ జీ
దేశంలో నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పావలా భాగం కూడా లేరని విప్రో టెక్నాలజీస్ ఛైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ అన్నారు. పూర్తి స్థాయి నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 20 శాతం మంది మాత్రమేనని ఆయన సోమవారం అజిమ్ ప్రేమ్ జీ వర్సిటీ రెండో స్నాతకోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశంలో 60 లక్షల మంది ఉపాధ్యాయులుండగా, వారిలో 20 శాతం మందికి అసలు నిబద్ధత అన్న పదమే తెలియదని, వీరి కారణంగా విద్యా రంగానికి ఉపయోగం కన్నా, నష్టమే ఎక్కువని కూడా ప్రేమ్ జీ చెప్పుకొచ్చారు. 60 శాతం మంది ఉపాధ్యాయులు, పలు అంశాలపై నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక మిగిలిన 20 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే నిబద్ధతతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే నయా టీచర్ల కంటే, మారుమూల పల్లెల్లోని ప్రభుత్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులే మెరుగైన ఫలితాలు రాబడుతున్నారని ప్రేమ్ జీ చెప్పారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రంతో కలిసి తాము పనిచేస్తున్నామని ఆయన ప్రకటించారు.