: అందరిదీ ఒకటే మాట... చానెళ్ళ ప్రసారాలు పునరుద్ధరించాలి!
టీవీ9, ఏబీఎన్ చానళ్ళకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆ రెండు చానళ్ళ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు సూచిస్తున్నారు. హైదరాబాదులోని సుందరయ్య కళానిలయంలో 'మీడియా స్వేచ్ఛ-పరిరక్షణ' అంశంపై సోమవారం అఖిలపక్ష సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సీపీఐ నారాయణ, విరసం నేత వరవరరావు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నిలిపివేసిన టీవీ9, ఏబీఎన్ చానళ్ళ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం కట్టిపెట్టాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో టీవీ9 యాజమాన్యం క్షమాపణ చెప్పినా కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని పలువురు అభిప్రాయపడ్డారు. అలాగే, ఏబీఎన్ చానల్ ప్రసారాల నిలిపివేతకు సరైన కారణం చూపలేకపోయారని వారు విమర్శించారు. ఈ సదస్సు సందర్భంగా నాలుగు తీర్మానాలను ఆమోదించి వాటిని గవర్నర్ కు అందజేశారు. మీడియా స్వేచ్ఛను కాపాడే విషయంలో గవర్నర్ చొరవ తీసుకోవాలని వారు కోరారు.