: క్యాన్సర్ చికిత్సలో ప్రొటీన్ థెరపీ


క్యాన్సర్ చికిత్స ఎంతో కష్టమైనది. రేడియోథెరపీ, కీమోథెరపీ వంటివి క్యాన్సర్ చికిత్సా విధానాల్లో ముఖ్యమైనవి. వాటితో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా సంభవిస్తాయి. ఈ ప్రాణాంతక వ్యాధిని నయం చేసే క్రమంలో ఓ సురక్షితమైన చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు. దానిపేరు ప్రొటీన్ థెరపీ. కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా, ఇది మంచి ఫలితాలను ఇస్తుందని పరిశోధకులు అంటున్నారు. దేహంలో క్యాన్సర్ వ్యాప్తికి కారణమయ్యే మెటాస్టాసిస్ ప్రక్రియను ఈ ప్రొటీన్ థెరపీ అడ్డుకుంటుందట. క్యాన్సర్ కణుతుల నుంచి విడవడ్డ క్యాన్సర్ కణాలు రక్తం ద్వారా శరీరంలోని మరికొన్ని ప్రదేశాల్లో చేరి అక్కడ అభివృద్ధి చెందుతాయి. దీన్నే మెటాస్టాసిస్ అంటారు. దీనిపై స్టాన్ ఫోర్డ్ వర్శిటీ బయో ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ జెన్నిఫర్ కొచ్రాన్ ఏమంటున్నారంటే... "నేటి కాలంలో డాక్టర్లు మెటాస్టాసిస్ ప్రక్రియను నిలువరించేందుకు, లేక, దాని తీవ్రత తగ్గించేందుకు కీమోథెరపీ వినియోగిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఈ చికిత్స ఏమంత ప్రభావం చూపడంలేదు, పైగా, దుష్ఫలితాలు కనిపిస్తున్నాయి" అని వివరించారు. తాము చేసిన పరిశోధనల్లో ఏఎక్స్ఎల్, జీఏఎస్6 ప్రొటీన్లను నిరోధించడం ద్వారా మెటాస్టాసిస్ ను సమర్థంగా అదుపు చేయగలిగామని కొచ్రాన్ తెలిపారు. ఈ రెండు ప్రొటీన్లు క్యాన్సర్ వ్యాప్తిలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. కాగా, ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న ప్రొఫెసర్ అమాటో గియాసియా మాట్లాడుతూ, ఇది ఎంతో నమ్మకమైన చికిత్సా విధానమని అన్నారు. క్యాన్సర్ వైద్యంలో నూతన పంథాకు తెరలేపుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News