: ఎర్రబెల్లి కేంద్రంగా టీఆర్ఎస్, టీడీపీల మధ్య రసవత్తర రాజకీయాలు
ఎర్రబెల్లి దయాకరరావు కేంద్రంగా గత రెండు రోజులుగా టీఆర్ఎస్, టీడీపీ మధ్య రసవత్తర రాజకీయాలు నడిచాయని తెలుస్తోంది. 'మై హోమ్స్' అధినేత రామేశ్వరరావు ఎర్రబెల్లితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా సన్నిహితుడు. మెట్రో భూముల విషయంలో రామేశ్వరరావుపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలతో ఎర్రబెల్లి విభేదించారు. చంద్రబాబు కూడా రేవంత్ కే మద్దతిస్తున్నారని ఆయన కొన్ని రోజులుగా కినుక వహించినట్టు సమాచారం. దీన్ని అవకాశంగా మలుచుకుని టీఆర్ఎస్ పార్టీ ఎర్రబెల్లిని తమ వైపుకు ఆకర్షించేందుకు ప్రయత్నించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రామేశ్వరరావు మధ్యవర్తిత్వం ద్వారా ఎర్రబెల్లిని తమవైపుకు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని సమాచారం. అయితే, ఆఖరి నిమిషంలో టీడీపీ అప్రమత్తం కావడంతో... టీఆర్ఎస్ ప్రయత్నాలు సఫలం కాలేదట. ఈ వార్తలను ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఖండించకపోవడం విశేషం. టీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా తనపై ఐదురోజులుగా విపరీతమైన ఒత్తిడి వచ్చిందని ఆయన తెలిపారు. అయితే, దీనికి తాను అంగీకరించలేదని.. జీవితాంతం తాను టీడీపీలోనే కొనసాగుతానని, చంద్రబాబే తన నాయకుడని ఆయన స్పష్టం చేశారు. తనకు ఆదివారం రాత్రి 11గంటలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చిన మాట నిజమేనని ఎర్రబెల్లి తెలిపారు. కేవలం, కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి గురించి మాట్లాడటానికే తాను సీఎం కేసీఆర్ ను కలవాలనుకున్నానని ఆయన అన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల కేసీఆర్ ను కలవడం కుదరలేదని ఆయన చెప్పుకొచ్చారు.