: కేసీఆర్ ను నేను కలవలేదు... జీవితాంతం టీడీపీలోనే ఉంటా: ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ ను ఆదివారం అర్థరాత్రి తాను కలవలేదని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మెట్రో భూముల విషయంలో తనకు, రేవంత్ కు మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు వచ్చిన మాట నిజమేనని ఆయన ఒప్పుకున్నారు. అయితే, ఈ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. మెట్రో భూముల విషయంలో రేవంత్ మైహోమ్స్ రామేశ్వర్ రావును తిట్టినా పర్వాలేదని, కానీ ఆ విషయాన్ని ఉపయోగించుకుని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేలా 'దొర' అని తిట్టడం సరికాదని ఆయన అన్నారు. మెట్రో భూముల విషయంలో, మైహోమ్స్ రామేశ్వర్ రావు తప్పుచేయలేదని ఇప్పటికీ తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. తనకు టీడీపీని వీడే ఆలోచన ఏమాత్రం లేదని... జీవితాంతం టీడీపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.