: మరో మూడు రోజుల్లో పెరగనున్న భారత్ పేరు ప్రతిష్ఠలు


మరో మూడు రోజుల్లో భారత పేరు ప్రతిష్ఠలు మరింతగా ఇనుమడించనున్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తిపతాక మరోసారి రెపరెపలాడనుంది. అక్టోబర్ 24 అర్ధరాత్రి భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అత్యంత చవకైన అంతరిక్ష పరిశోధనకు శ్రీకారం చుట్టిన భారత అంతరిక్ష పరిశోధకుల చిరకాల వాంఛ బుధవారం తీరనుంది. అంగారకయాత్రకు 450 కోట్ల రూపాయ బడ్జెట్‌ ఖర్చు అవుతుందని ఇస్రో భావించగా, ప్రయోగం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 244.06 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన ఇస్రో, 82.1 కోట్ల కిలోమీటర్ల మహా ప్రయాణానికి తొందర్లోనే ముగింపు పలకనుంది. ఎందరో శాస్త్రవేత్తల కలల మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) అంగారకుడిని అందుకోవడానికి ఇక మరో 72 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. నిర్దేశించిన మార్గంలో అంతులేని సవాళ్లను అధిగమిస్తూ సుదూర తీరానికి మామ్ సాఫీగా సాగిపోతోంది. పది నెలలుగా అంతరిక్షంలో అలుపెరగని ప్రయాణం చేస్తున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం సుమారు 98 శాతం ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మరో 2 శాతం ప్రయాణిస్తే లక్ష్యం అరుణగ్రహం (కుజుడు) కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. 680 మిలియన్ కిలో మీటర్ల (82 కోట్ల కిలోమీటర్లు) సుదూర పయనంతో లక్ష్యం చేరి... మామ్ సరికొత్త రికార్డు నెలకొల్పుతుందని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మామ్ లక్ష్యం చేరడంపై తమకు ఎలాంటి ఆందోళన లేదని ఆయన స్పష్టం చేశారు. మామ్ లక్ష్యాన్ని చేరితే ఆసియా చరిత్రలో తమ ప్రయోగం సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మామ్ ఆగస్టు 30 నాటికి 62.2 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిందని తెలిపిన ఆయన, సెకనుకు 22.33 కిలోమీటర్ల వేగంతో మామ్ మిగిలిన ప్రయాణం కొనసాగిస్తోందని వెల్లడించారు. ఇంకా మిగిలి ఉన్న 19.9 కోట్ల కిలోమీటర్ల దూరం సమర్ధవంతంగా పూర్తి చేస్తుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News