: నేను చేసిన ఆరోపణలు వాస్తవమే... కేటీఆర్ కి సవాలు విసిరిన రేవంత్ రెడ్డి


టీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతల సవాళ్లకు వీడియో సాక్ష్యం రూపంలో సమాధానం ఇచ్చారు. జనవరి 8వ తేదీన మైహోం రామేశ్వరరావు గారే 2 వేల కోట్లకు భూములు కొన్నానని చెప్పారని తెలిపారు. ఈ మేరకు జనవరి 8న పొన్నాల లక్ష్మయ్య సభను అడ్డుకునేందుకు హరీష్ రావు, జూపల్లి ఇతర టీఆర్ఎస్ నేతలతో మై హోం రామేశ్వరరావు కలిసి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి సభను అడ్డుకున్నది వాస్తవం కాదా? అని ఆయన అడిగారు. గేమింగ్ సిటీలో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన రామేశ్వరరావు, అంతకంటే గొప్పదైన, ప్రజల అవసరాలు తీర్చే మెట్రోరైల్ కోసం ఆ భూమిని కేటాయించవద్దని ఎందుకు ఆందోళన చేశారని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వం కేటాయించకుండా నిలిపేసిన భూములను, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా కేటాయించిందని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ప్రదర్శించారు. మరి వీటిపై దొరల నేతలు ఏం సమాధానం చెబుతారని ఆయన అడిగారు. గతంలో ఆ ఫైల్ ను పక్కన పెట్టిన అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి కారణం ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. డీఎల్ఎఫ్ కు సంబంధించిన భూములు ఎవరికి? ఎందుకు? కేటాయించారని ఆయన నిలదీశారు. భూకేటాయింపుల మార్పును ఒప్పుకోమని ఎల్ అండ్ టీ ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమా? కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎల్ అండ్ టీ భూముల అన్యాక్రాంతంపై సూటిగా మాట్లాడాలని ఆయన సూచించారు. ఎవరెవరితోనో వ్యాఖ్యలు చేయించడం కాదని, ప్రభుత్వ పెద్దలు మాత్రమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీఐఐసీ ఈడీ చెప్పిన ప్రకారం ఈ భూబదలాయింపులు ఆగస్టులో జరిగినట్టు తెలిపారు. అంటే ఆగస్టులో ఉన్న ప్రభుత్వమేదని ఆయన ప్రశ్నించారు. నాలెడ్జ్ హబ్ పై కేటీఆర్ చర్చకు సిద్ధమా? అని ఆయన సవాలు విసిరారు. ఆయన వందిమాగధులను, అధికారులను, బానిసలను ఎవరిని తెచ్చుకున్నా పర్లేదని ఆయన వెసులుబాటు కల్పించారు. కేవలం నెలల కాలంలోనే రామేశ్వరరావుకు ఎలా భూకేటాయింపులు చేశారని ఆయన అడిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అవకతవకలకు పాల్పడకపోతే, తక్షణం అఖిలపక్షం నిర్వహించి, మెట్రో రైల్ పై ఫైళ్లన్నీ స్పీకర్ సమక్షంలో పరిశీలిద్దామని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ భూకేటాయింపు తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిని రద్దు చేయకపోతే శాసనసభను స్తంభింపచేస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ భూ కేటాయింపులపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తనపై పరువు నష్టం దావా వేస్తానంటున్నవారు వారి పరువు మర్యాదలను సరిచూసుకోవాలని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News