: తెలంగాణ కల ఇంత త్వరగా విచ్ఛిన్నమైపోతుందనుకోలేదు: ప్రొ. హరగోపాల్
తెలంగాణ కల ఇంత త్వరగా విచ్ఛిన్నమైపోతుందని ఊహించలేదని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. హైదరాబాదు కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ ఉంటుందని భావించామని అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయవేదికలో మావోయిస్టులు లేరని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ వేదికలో ఉన్నది మేధావులని అన్నారు. కేసీఆర్ తమ అజెండా మావోయిస్టు అజెండా అన్నారని ఆయన గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్ కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక పెట్టిన సమావేశంలో తప్పేముంటుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశల్ని, ఆశయాల్ని వమ్ము చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు.