: కాశ్మీర్ వరద బాధితుల కోసం ఆహారపదార్థాలు, దుప్పట్లు పంపిన సచిన్
జమ్మూ కాశ్మీర్ లో వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితుల దీనావస్థ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ను కదిలించింది. వెంటనే వారిని ఆదుకోవాలని నిశ్చయించాడు. ఈ క్రమంలో సచిన్ 5 టన్నుల ఆహారపదార్థాలతో పాటు, 1000 దుప్పట్లను సాయంగా అందించాడు. అంతేగాకుండా, రోజూ పదివేల మందికి మంచినీటిని అందించేందుకని 1000 వాటర్ ఫిల్టర్లు, పదివేల కుటుంబాలకు వచ్చే మూడు నెలల కాలానికి సరిపడా నీటిని శుద్ధి చేసేందుకు లక్ష క్లోరిన్ టాబ్లెట్లు కూడా పంపాడు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘం అధికారి రంజిత్ కల్రా మీడియాకు తెలిపారు. సచిన్ సాయానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తరపున జమ్మూ డివిజనల్ కమిషనర్ షంత్ మను కృతజ్ఞతలు తెలిపారు.