: లీటర్ పెట్రోల్ కి 100 కిలోమీటర్ల మైలేజినిచ్చే కారు వచ్చేసింది
మామూలుగా ఏ బ్రాండ్ కారైనా లీటరు పెట్రోలుకి ఎంత మైలేజి ఇస్తుంది? సాధారణంగా 15 నుంచి 20 కిలోమీటర్లు! కారు సంగతి పక్కన పెట్టండి, బైకులు కూడా 60-80 కిలోమీటర్లకు మించి మైలేజి ఇవ్వవు. అలాంటిది ఒక కారు లీటరు పెట్రోలుకు 100 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందంటే నమ్ముతారా? అంతసీన్ లేదని తీసిపారేస్తారు కదూ? కానీ నమ్మితీరాల్సిందే! కొత్తగా తయారైన 'ఇయోల్యాబ్' అనే కారు లీటరు పెట్రోలుకు వంద కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని దాని యజమాని రెనో కంపెనీ చెబుతోంది. దీనిని ఇప్పటికే పరీక్షించారని, దీనిని ప్యారిస్ మోటారు షోలో కూడా ప్రదర్శించారని ఆ సంస్థ వెల్లడించింది. సరికొత్త టెక్నాలజీతో ఇంధనాన్ని అత్యంత తక్కువ వినియోగించుకునే కారును రూపొందించాలన్న లక్ష్యంతో దీనిని తయారుచేసినట్టు రెనో కంపెనీ చెబుతోంది. బి-సెగ్మెంటు కారుగా చెబుతున్న దీని కోసం అత్యాధునిక 100 టెక్నాలజీలు ఉపయోగించారు. ఈ కారు కోసం ఏరోడైనమిక్స్ను కొత్తగా రూపొందించారు. కారు బరువు తక్కువ ఉండేలా చూశారు. కారులో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా వాడారు. దీని వల్ల ఈ కారు పెట్రోలు, కరెంటుతో కూడా నడుస్తుంది. ఇకపై కారును షోరూంలో చూసి, పక్కన నిలబడి ఫొటోలు తీసుకుని ఆనందించే రోజులు పోయాయని, అందరూ సొంత కారు కలను నిజం చేసుకునే రోజులు వస్తున్నాయని రెనో కంపెనీ స్పష్టం చేసింది.