: నలంద వర్సిటీ ప్రారంభోత్సవానికి కలాం, నితీశ్ ల గైర్హాజరు
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వ విద్యాలయంగా పేరుగాంచి, కొంగొత్త హంగులతో రూపుదిద్దుకున్న నలంద యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లు గైర్హాజరయ్యారు. అసలు ప్రాచీన విశ్వ విద్యాలయానికి సరికొత్త రూపకల్పనకు నాటి రాష్ట్రపతి హోదాలో ఏపీజే అబ్దుల్ కలాం బీజం వేయగా, దానికి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కార్యరూపానికి అంకురార్పణ చేశారు. శనివారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నలంద వర్సిటీకి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంఝీ, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీలు హాజరయ్యారు. ఈ బృహత్కార్యానికి తెరలేపిన అబ్దుల్ కలాం, నితీశ్ కుమార్ లకు కూడా ఆహ్వానాలు వెళ్లినా, వారు మాత్రం కార్యక్రమానికి హాజరు కాలేదు.