: హార్వర్డ్ వర్సిటీ కంటే ఐఐటీల ర్యాంకే మిన్న: స్మృతి ఇరానీ
విద్యా బోధనలో హార్వర్డ్ యూనివర్సిటీది ప్రత్యేక స్థానం. అమెరికాలోని మాసాచుసెట్స్ లో శతాబ్దానికి పైగా సేవలందిస్తున్న ఆ విద్యా సంస్థలో విద్యనభ్యసించడం ప్రతి ఒక్కరి డ్రీమ్. అయితే, ఇదంతా గతం. తాజాగా హార్వర్డ్ వర్సిటీని తలదన్నే వర్సిటీలు, విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఎక్కడనుకుంటున్నారా..? అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకెళుతున్న భారత్ లో! మనకు తెలియకుండా అంత ప్రతిష్ఠాత్మక వర్సిటీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయనుకుంటున్నారా? అంత దీర్ఘంగా ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే హార్వర్డ్ కంటే అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వర్సీటీలు, మన దేశానికే తలమానికంగా నిలుస్తున్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...ఐఐటీలు! అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కేపిటల్ సంస్థ పిచ్ బుక్ డేటా రూపొందించిన తాజా వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం ఓ కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తున్న ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థ జాబితాలో మన ఐఐటీలు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి. హార్వర్డ్ వర్సిటీ కంటే పై మెట్టులోనే ఉన్నాయి. ఐఐటీల్లో విద్యనభ్యసిస్తున్న భారత యంగ్ టర్క్ లు ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేద్దామనుకునే సంప్రదాయక ఆలోచనా ధోరణికి తిలోదకాలిస్తూ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారట. కొత్తగా కంపెనీలను పెట్టడమే కాక వాటిని మెరుగైన కంపెనీలుగా తీర్చిదిద్దడంలోనూ ఆ విద్యా సంస్థల విద్యార్థులది అందె వేసిన చెయ్యేనట. అందుకేనేమో, ఐఐటీలను మరింత మెరుగైన విద్యా సంస్థలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు.