: అభివృద్ధి చేయాలంటే తెలంగాణకు ఇంత డబ్బు అవసరమవుతుందట
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలీసు వ్యవస్థ ఆధునికీకరణ, చెరువుల పూడిక తీతలు, ఐటీ, వాటర్ గ్రిడ్, రోడ్లు, విద్య, వ్యవసాయ విద్యుత్తుకు సుమారు 23,475 కోట్ల రూపాయలు అవసరమవుతాయని 14వ ఆర్ధిక సంఘానికి ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రం వాటాను 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం 14వ ఆర్ధిక సంఘానికి సమర్పించిన ప్రతిపాదనలివే... పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు 4,216 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపింది. అలాగే చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధికి 4,200 కోట్ల రూపాయలు కావాలని చెప్పింది. ఐటీ రంగానికి 1,091 కోట్ల రూపాయలు అవసరమవుతాయని వివరించింది. వాటర్ గ్రిడ్ కు 3,500 కోట్ల రూపాయలు అవసరమని సూచించింది. హరితహారానికి 1,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పింది. ప్రాధమిక విద్యకు 1300 కోట్ల రూపాయలు ఇవ్వాలని అడిగింది. వ్యవసాయ విద్యుత్తు కోసం 1300 కోట్ల రూపాయలు అవసరమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిన్నింటికీ కలిపి 23,475 కోట్ల రూపాయలు కావాలని 14వ ఆర్ధిక సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది.