: అప్పటి తప్పులు ఇప్పుడు ఒప్పులెలా అవుతాయి: రేవంత్ ప్రశ్న
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులు తప్పన్నప్పుడు అవే కేటాయింపులు ఇప్పుడు ఒప్పెలా అవుతాయని టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎల్ అండ్ టీని బెదిరించి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడించారని అన్నారు. మెట్రో కార్ పార్కింగ్ కోసం కేటాయించిన భూమిని మరొకరికి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఒక వ్యక్తికి లాభం చేకూర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందా? అని ఆయన నిలదీశారు. అలా పని చేయకపోతే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పక్కన పెట్టిన ఫైలును ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ ఎందుకు ఆమోదించారని ఆయన అడిగారు. కొంత మంది స్వార్థం కోసం రకరకాల మార్పిడులు చేస్తున్నారని, ఇప్పటికే కేటాయించిన భూములను రద్దు చేసి, వాటిని ఓ వ్యక్తికి కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. మెట్రోకు కేటాయించిన భూమిపై ఎల్ అండ్ టీ సంస్థ, ఎన్వీఎస్ రెడ్డి ప్రభుత్వానికి లేఖలు రాయలేదా? అని ఆయన ప్రశ్నించారు.