: చైనా అధ్యక్షుడి పేరు... న్యూస్ రీడర్ ఉద్యోగాన్ని ఊడగొట్టింది!


అవును... ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడి పేరు, దూరదర్శన్ న్యూస్ రీడర్ ఉద్యోగాన్ని ఊడగొట్టింది. సాక్షాత్తు ప్రసార భారతి చీఫ్ జవహర్ సర్కార్ చెప్పిన తర్వాత నమ్మక తప్పదు కదా మరి. అసలు విషయమేంటంటే..., చైనా అధ్యక్షుడు ఝీ జిన్ పింగ్ లో తొలి ‘ఝీ’ని ఆంగ్లంలో ‘ఎక్స్, ఐ’ అనే రెండు అక్షరాల సమాహారంగా రాస్తామని మనకు తెలిసిందే. ఇక, రోమన్ అంకెల్లోని '11' కూడా ఈ రెండు అక్షరాల మాదిరిగానే ఉంటుంది. మరి, దూరదర్శన్ న్యూస్ రీడర్ కు, ఈ రెండింటిపై అవగాహన ఉందో, లేక రోమన్ అంకె మాత్రమే గుర్తుందో తెలియదు కాని, చైనా అధ్యక్షుడి పేరును ‘ఎలెవెన్ జిన్ పింగ్’గా ఉచ్చరించేసింది. అంతే... వార్తలు ముగిసేలోగా సదరు న్యూస్ రీడర్ చేతిలో ఉద్వాసన ఉత్తర్వులు ప్రత్యక్షమయ్యాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఛానెల్ లో పనిచేస్తున్న న్యూస్ రీడర్ కు ఆమాత్రం తెలియకపోతే ఎలా? అన్న రీతిలో ‘‘ఆ న్యూస్ రీడర్ ను తొలగించేశాం’’ అంటూ ప్రసార భారతి చీఫ్ జవహర్ సర్కార్ ఆవేశంగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News