: దేవిశ్రీ ప్రసాద్ మాండలిన్ శ్రీనివాస్ శిష్యుడే!


తెలుగు సినీ సంగీతం సంచలనం దేవిశ్రీ ప్రసాద్ మన మాండలిన్ శ్రీనివాస్ శిష్యుడే. 12 ఏళ్ల పాటు శ్రీనివాస్ వద్ద దేవిశ్రీ ప్రసాద్ శిష్యరికం చేశాడు. దేవి ఆయన దగ్గరే సంగీతంలో ఓనమాలు దిద్దాడు. హైస్కూల్ లో చదువుతుండగా సంగీతం మీద దేవి ఆసక్తిని గమనించిన అతని తల్లి శిరోమణి చెన్నైలోని మాండలిన్ శ్రీనివాస్ దగ్గరకు తీసుకువెళ్లింది. తొలి పరిచయంలో దేవిశ్రీ ప్రసాద్ ను ఏదైనా ఒక పాట పాడమని మాండలిన్ శ్రీనివాస్ కోరాడు. వెంటనే, దేవి తన అభిమాన గాయకుడైన మైకేల్ జాక్సన్ పాటను పాడాడు. ఆ పాట విన్న వెంటనే చిరునవ్వు నవ్వి... అదే పాటను అత్యద్భుతంగా మాండలిన్ పై శ్రీనివాస్ వాయించారు. దీంతో అచ్చెరువొందిన దేవి సంగీతంలో ఇకపై తన గురువు మాండలిన్ శ్రీనివాసే అని మనస్సులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆరోజు నుంచి సుమారు 12 ఏళ్ల పాటు దేవిశ్రీ ప్రసాద్ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఆయన దగ్గర శిష్యరికం చేసేవాడు. ఒక్క స్కూల్ టైంలో తప్ప మిగతా సమయమంతా మాండలిన్ శ్రీనివాస్ ఇంట్లోనే గడిపేవాడు. మద్రాస్ లో ఏ కచ్చేరీ చేసినా... దేవిశ్రీ ప్రసాద్ ఆయన వెంట ఉండేవాడు. కచేరీకి ఏర్పాట్లు చేయడం... వాయిద్యాలు అందించడం ఇవన్నీ దేవి దగ్గరుండి చూసుకునేవాడు. తన గురువు సంగీతం నేర్పడానికి ఎవరి దగ్గరా డబ్బు తీసుకునేవారు కాదని... శిష్యులకు ఏం అవసరమో అన్నీ ఆయనే స్వయంగా సమకూర్చేవారిని దేవిశ్రీ ప్రసాద్ పేర్కొన్నాడు. మాండలిన్ శ్రీనివాస్ తన శిష్యుల మీద ఎప్పుడూ కోప్పడేవారు కాదని... శిష్యుల్లోని ప్రతిభా పాటవాలు వాటంతట అవే బయటకు వచ్చేలా ఆయన శిక్షణ ఇచ్చేవారని దేవి వెల్లడించాడు.

  • Loading...

More Telugu News