: 'నెక్ట్స్ జనరేషన్ కండోమ్' వివరాలు తెలిపిన బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకడైన బిల్ గేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం తెలిసిందే. వేల కోట్ల రూపాయలను ఆయన వివిధ సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తుంటారు. గేట్స్ 'నెక్ట్స్ జనరేషన్ కండోమ్' రూపకల్పన కోసం సుమారు రూ.6 కోట్ల రూపాయలను నిధుల రూపేణా యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్ కు ఇచ్చారు. ఆ పరిశోధనలపై ఆయన మాట్లాడుతూ... అటు, కుటుంబ నియంత్రణకు ఉపయోగపడేలా, ఇటు, అదనపు సంతృప్తి లభించేలా ఈ కండోమ్ ఉంటుందన్నారు. ఇది అతి పల్చగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మాంచెస్టర్ వర్శిటీ పరిశోధకులు ఈ అడ్వాన్స్ డ్ కండోమ్ ను సూపర్ లైట్ కండక్టివిటీ పదార్థం గ్రాఫేన్ తో రూపొందించినట్టు తెలుస్తోంది. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలపై ఢిల్లీలో నిర్వహించిన ఓ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. భార్య మెలిండాతో సహా భారత్ వచ్చిన గేట్స్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదవారి జీవితాలను మెరుగుపరిచే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.