: మాండలిన్ శ్రీనివాస్ తెలుగువాడు... పాలకొల్లులోనే పుట్టాడు!
విఖ్యాత సంగీత కళాకారుడు మాండలిన్ శ్రీనివాస్ తెలుగువాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1969 ఫిబ్రవరి 18 న ఆయన జన్మించారు. ఆయన తండ్రి పేరు సత్యన్నారాయణ. 1978లో... తొమ్మిదేళ్ల చిరుప్రాయంలోనే శ్రీనివాస్ తన తొలి కచేరీని గుడివాడలో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ఇవ్వడం విశేషం. ఆ తర్వాత 1981లో, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ ఏర్పాటు చేసిన మద్రాస్ మ్యూజిక్ ఫెస్టివల్ లో కచేరీ ఇచ్చారు. క్రమంగా, పదిహేనేళ్లు నిండకుండానే, విదేశాల్లో పేరు మోసిన అంతర్జాతీయ సంగీత విద్వాంసులతో కలిసి సంగీత కచేరీలు ఇవ్వడం ప్రారంభించారు. 1983లో జర్మనీలో జరిగిన జాజ్ బెర్లిన్ మ్యూజిక్ ఫెస్టివల్ లో ఇచ్చిన ప్రదర్శనతో మాండలిన్ శ్రీనివాస్ పేరు అంతర్జాతీయంగా మారు మ్రోగింది. ఈ ఫెస్టివల్ లో ఆహూతులు అనేక సార్లు శ్రీనివాస్ ప్రదర్శనను 'రిపీట్' చేయించుకుని ఆనందించారు. దేశవిదేశాల్లో కొన్ని వేల కచేరీలను మాండలిన్ శ్రీనివాస్ ఇప్పటివరకు ఇచ్చారు. చిన్నవయసులోనే మాండలిన్ వాయిద్యంలో ప్రపంచఖ్యాతిని పొందిన శ్రీనివాస్ 'మాండలిన్ శ్రీనివాస్' గా గుర్తింపు పొందారు. 1998లో కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2010లో ఆయనకు సంగీత నాటక అకాడమీ అవార్డు దక్కింది. ప్రస్తుతం శ్రీనివాస్ కుటుంబం చెన్నైలో సెటిల్ అయ్యింది.