: ఏపీకి ప్రత్యేక హోదా కోసం రంగంలోకి చంద్రబాబు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రం, నాన్చుడు ధోరణితోనే ముందుకుపోతోంది. అంతేగాక, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కొందరు కేంద్ర మంత్రులు కూడా వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తమకు ఫ్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గళమెత్తారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మధ్దతు కూడగట్టాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ అజెండాతోనే ఈ నెల 22న ఆయన ఛత్తీస్ గఢ్ వెళ్లనున్నారు. తదనంతరం మిగిలిన రాష్ట్రాల్లోనూ పర్యటించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందించుకున్నారు. అన్ని రాష్ట్రాల మద్దతు కూడగట్టి, ఎలాగైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని ప్రభుత్వ, పార్టీ వర్గాలు చెబుతున్నాయి.