: ఈనెల 25న మోడీ డ్రీమ్ కాన్సెప్ట్ 'మేక్ ఇన్ ఇండియా'కు శ్రీకారం
'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 25న శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రచారం కల్పించడానికి మోడీ ఆ రోజు ఓ అంతర్జాతీయ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. దీనికి అమెరికా, జపాన్, కొరియా, స్వీడన్, పోలాండ్, ఆస్ట్రేలియా, చైనా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల నుండి అనేకమంది అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మోడీ విదేశీ కంపెనీలను ఆకట్టుకోవడానికి భారీ ప్రోత్సాహకాలను ప్రకటించనున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 'మేక్ ఇన్ ఇండియా'ను మరింత విజయవంతం చేయడానికి దేశ రాజధానితో పాటు అదే రోజు ముంబయి, బెంగళూరు, చెన్నై లాంటి పలు రాష్ట్రాల రాజధానుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. భారత్ ను అంతర్జాతీయ ఉత్పాదక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మోడీ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా, భారతదేశంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడం... దేశ వాణిజ్యంతోపాటు ఆర్థిక వృద్ధి రేటు ఊపందుకునేలా చేయాలని మోడీ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ ఏడాది, ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రసంగించిన సందర్భంగా నరేంద్రమోడీ తొలిసారిగా 'మేక్ ఇన్ ఇండియా' స్లోగన్ ను ఎనౌన్స్ చేశారు.