: మహారాష్ట్రలో బీజేపీ, సేనల మధ్య చెదురుతున్న సయోధ్య
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపక్ష కూటమి బీజేపీ-శివసేన మధ్య గురువారం విభేదాలు తార స్థాయికి చేరాయి. సీట్ల సర్దుబాటుపై 24 గంటల్లోగా తేల్చాలని బీజేపీ జారీ చేసిన అల్టిమేటంపై శివసేన మండిపడింది. మొత్తం సీట్లలో 135 సీట్ల చొప్పున పంచుకోవడంతో పాటు మిగిలిన 18 సీట్లను కూటమిలోని మిగిలిన పార్టీలకు ఇద్దామన్న బీజేపీ ప్రతిపాదనకు శివసేన ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. 119 సీట్ల కంటే ఒక్క సీటును కూడా బీజేపీకి వదలబోమని సేన నేతలు తేల్చిచెబుతున్నారు. దీనిపైనే బుధవారం ఇరుపార్టీల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో ఈ విషయంపై 24 గంటల్లోగా తేల్చాలని, లేనిపక్షంలో తాము తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని బీజేపీ, శివసేనకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన శివసేన, ఏ ఒక్కరి కోసమో తమ ఆత్మ గౌరవాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పింది. బీజేపీకి 119 సీట్ల కంటే ఒక్క సీటునూ అదనంగా కేటాయించే పరిస్థితి లేదంటూ ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ గురువారం రాత్రి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరలో ఫుల్ స్టాప్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. సేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి, అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరు పార్టీల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు తాము సిద్ధంగా లేమని ఆరెస్సెస్ ప్రకటించింది. ఇరు పార్టీల్లో సీనియర్లు, అనుభవజ్ఞులున్నారని, వారి సమస్యలను వారే పరిష్కరించుకుంటారని ఆ సంస్థ అధికారి ప్రతినిధి మన్మోహన్ వైద్య ప్రకటించారు.