: శివ... శివా... ఉద్యోగుల బద్ధకం వదిలించవా!


భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయాల్లోనే కాదు, 'దేవదేవుడి సేవల' విషయంలో కూడా దేవాదాయశాఖ ఉద్యోగులు అలసత్వాన్ని వీడటం లేదు. దీన్ని నిరూపించే సంఘటన నిన్న శ్రీకాళహస్తిలో జరిగింది. పరమేశ్వరుడిని తెల్లవారుఝామునే మంగళవాయిద్యాలతో మేలుకొలపడం శ్రీకాళహస్తిలో ఎన్నో దశాబ్దాలుగా వస్తోన్న ఆచారం. ఉదయం ఐదు గంటలకు మంగళవాయిద్యాలు, 5.15 గంటలకు గోమాత పూజ, 5.30 గంటలకు సుప్రభాతసేవ ముక్కంటి ఆలయంలో టంచనుగా సమయానికి నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇటీవల కాలంలో దేవుడి సేవల విషయంలో కూడా సిబ్బంది విపరీతమైన బద్ధకాన్ని ప్రదర్శిసున్నారు. దీన్ని బలపరిచేలా నిన్న ఉదయం కాళహస్తిలో ఓ సంఘటన జరిగింది. గురువారం ఉదయం 5.30 గంటలు దాటినా మంగళవాయిద్యాలు వాయించే ఉద్యోగులు, గోపూజ, సుప్రభాతసేవలు చేయాల్సిన కొంతమంది సిబ్బంది గురువారం హాజరుకాలేదు. దీంతో కాళహస్తీశ్వరుడికి 'ఉదయ సేవలు' గంటపైనే ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. నిన్న ఆలయ ఇన్‌చార్జి ఈవో శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీతో ఈ విషయాలు వెలుగు చూశాయి. దేవదేవుడికి సుప్రభాత సేవ చేయాల్సిన సిబ్బంది కూడా చాలా ఆలస్యంగా రావడంతో ఈవో తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా, ఆలస్యంగా విధులకు హాజరైన ఉద్యోగులకు హాజరుపట్టీలో గైర్హాజరు వేశారు. వారి వద్ద క్షమాపణ పత్రాలు రాయించుకున్నారు. ఇకపై ఆలస్యంగా విధులకు హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల ఇదే తరహాలో కొంతమంది ఉద్యోగులు సుప్రభాత సేవకు ఆలస్యంగా రావడంతో వారికి జరిమానా కూడా విధించారు. అయినా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. కొంతకాలంగా ఆలయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. దీని వల్ల ఆలయంలో అన్ని సేవలు ఆలస్యంగా మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆలయ పాలనను గాడిలో పెట్టడానికి...అవినీతిని అరికట్టడానికి ఇంఛార్జి ఈవో శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.

  • Loading...

More Telugu News