: కుటుంబం కోసం బస్ షెల్టర్లు క్లీన్ చేస్తున్న మాజీ క్రికెటర్


క్రికెటర్ల లైఫ్ స్టయిల్ అంటే ఎంత లగ్జరియస్ గా ఉంటుందో మీడియాలో మనం చూస్తుంటాం. లేటెస్ట్ మోడల్ కార్లు, ఖరీదైన స్పోర్ట్స్ బైకులు, బంగ్లాలు, డిజైనర్ దుస్తులు... ఇలా, ఎంతో రిచ్ గా కనిపిస్తారు. జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటేనే పైవన్నీ సాధ్యపడతాయి. అస్తవ్యస్త జీవనవిధానానికి అలవాటు పడితే మాత్రం ఈ న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ లాగా తయారవుతారు. ఒకప్పుడు మూడో భార్య మెల్ క్రోసర్ కోసం ఖరీదైన 3.2 క్యారట్ల వజ్రాన్ని కొనుగోలు చేసిన కెయిర్న్స్... ఇప్పుడు కుటుంబ పోషణ కోసం ఆక్లాండ్ లో బస్ షెల్టర్లు క్లీన్ చేస్తున్నాడు. కెయిర్న్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై న్యాయపరమైన విచారణ జరుగుతోంది. కోర్టు ఖర్చులు భారంగా మారడంతో కెయిర్న్స్ పనిలో దిగక తప్పలేదు. బస్ షెల్టర్లు క్లీన్ చేసినందుకు గాను ఈ మాజీ క్రికెటర్ కు గంటకు రూ.1000కి పైగా ముడతాయి. దీనిపై కెయిర్న్స్ మిత్రుడు, మాజీ క్రికెటర్ డియాన్ నాష్ మాట్లాడుతూ, తన ఫ్రెండ్ ధైర్యంతో ముందుకు కదిలాడని పేర్కొన్నాడు. కుటుంబం కోసం కష్టపడి పనిచేస్తున్నాడని తెలిపాడు. కెయిర్న్స్ పేరు ఫిక్సింగ్ వ్యవహారంలో తెరపైకి రావడాన్ని ఓ స్నేహితుడిగా జీర్ణించుకోలేకపోతున్నానని నాష్ అన్నాడు. ఇక, కెయిర్న్స్ నిర్ణయాన్ని క్రోసర్ కూడా సమర్థించింది. ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న ఈ ఇద్దరు బిడ్డల తల్లి మాట్లాడుతూ, బస్ షెల్టర్లు క్లీన్ చేసే చిన్న ఉద్యోగంలో చేరడం మినహా అతనికి మరో మార్గం లేదని తెలిపింది. కుటుంబం కోసమే అతను పనిచేస్తున్నాడని, తమకు సొంత ఇల్లు కూడా లేదని, అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయింది.

  • Loading...

More Telugu News