: తెలంగాణ రాష్ట్రం కోసం ప్రపంచంలోనే నంబర్ వన్ పారిశ్రామిక విధానాన్ని రూపొందించాం: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి... దేశంలోనే కాదు, ప్రపంచంలోనే నంబర్ వన్ పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పారిశ్రామిక అనుమతులు త్వరితగతిన వచ్చేలా ఈ విధానాన్ని రూపొందించామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుస్తామని, ఇందుకోసం అవినీతి రహిత పారిశ్రామిక విధానాన్ని తయారుచేశామని కేసీఆర్ వెల్లడించారు. పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వారికి సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు ఒకే చోట మంజూరయ్యే విధంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని ఆయన అన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ విధానాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. ఇకపై, పారిశ్రామిక అనుమతులను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని కేసీఆర్ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా... అడ్డాకుల మండలంలోని వేముల గ్రామంలో కోజెంట్ గ్లాస్ ఇండస్ట్రీస్ ను ఈ మధ్యాహ్నం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఆయన పై వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల స్థాపన కోసం మహబూబ్ నగర్ జిల్లాలో 34,184 వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని కేసీఆర్ తెలిపారు. కోజెంట్ గ్లాస్ ఇండస్ట్రీస్ ఏర్పాటు వల్ల 500 మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News