: బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కు ముస్లిం మతపెద్దల సవాల్
మదర్సాలు టెర్రరిస్టులను, జిహాదీలను తయారుచేస్తున్నాయని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఆరోపించడంపై ముస్లిం మతపెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ స్వయంగా వచ్చి మదర్సాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వారు సవాల్ విసిరారు. జామియా అష్రాఫియా ఖాద్రియా మదర్సా బోధకుడు సయ్యద్ మొయిన్ అష్రాఫ్ మాట్లాడుతూ, "అతడిని ఆహ్వానిస్తున్నాం. ఏ సమయంలోనైనా, ఏ మదర్సానైనా పరిశీలించుకోవచ్చు. మా పాఠ్య ప్రణాళికను తెలుసుకోవచ్చు. మదర్సాలు టెర్రరిస్టులను తయారుచేస్తున్నాయన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాలను చూపాలి" అని పేర్కొన్నారు. సాక్షి మహరాజ్ ఉత్తరప్రదేశ్ లోని వున్నావో లోక్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మదర్సాలు జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే, మహరాజ్ వ్యాఖ్యల వ్యవహారానికి బీజేపీ దూరంగా ఉంది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.