: ఐదేళ్లకే 'ఐదడుగులు' మించిపోయాడు!
పాఠశాలలో కిండర్ గార్టెన్ లో అడుగు పెట్టే సరికే కరణ్ సింగ్ ఐదడుగుల ఎత్తు ఉన్నాడు. అంతే, క్లాసులోని పిల్లలంతా పరుగులు పెట్టారు. అలా మొదట్లో తన కొడుకుకు దూరంగా జరిగిన పిల్లలు ఆ తర్వాత మంచి స్నేహితుడిగా చూసుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన కరణ్ తండ్రి చెబుతున్నారు. కొన్ని నెలలుంటే, ఆరో జన్మదినం జరుపుకునే కరణ్ ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుకి వస్తాడట. విశేషం ఏమిటంటే, వాళ్లమ్మ కూడా పొడగరే! అతడి తల్లి స్వెత్లానా సింగ్ ఏడడుగుల రెండంగుళాల ఎత్తుంది. ఇప్పటికే 25 ఏళ్ల వయసున్న స్వేత్లానా, ఇంకా పెరుగుతూనే వుంది. రెండేళ్లకు నాలుగు అంగుళాల చొప్పున ఎత్తు పెరిగిన ఆమె, 2012 దాకా భారత పొడగరి మహిళగా గిన్నిస్ రికార్డు నమోదు చేసింది. అయితే పశ్చిమబెంగాల్ కు చెందిన సిద్దిఖా పర్వీన్ (8.2 అడుగులు) స్వెత్లానా రికార్డును బద్దలు కొట్టింది. కాగా, బెంగళూరులో చదువుకుంటుండగా, స్వెత్లానాతో ప్రేమలో పడి, 2007లో ఆమెను వివాహం చేసుకున్నానని చెప్పే ఆమె భర్త సంజయ్, తామిద్దరం 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' లాంటి వారమని అంటాడు. ఈయనగారు కూడా ఏం తక్కువ తినలేదు లెండి ... ఎందుకంటే, ఈయన ఎత్తు ఆరడుగుల ఆరంగుళాలు!