: నష్టనివారణకు ఉపక్రమించిన టి సర్కారు... ఎల్ అండ్ టీ ఎండీ తో అత్యవసరంగా భేటీ అవనున్న కేసీఆర్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటామని ఎల్అండ్ టీ లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్యం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఏమాత్రం సహకరించడం లేదని లేఖలో ఎల్ అండ్ టీ ఎండీ వీబీ గాడ్గిల్ ఆరోపించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్ట్ విషయంలో చెడ్డ పేరు తెచ్చుకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. దీంతో, ఈ ఉదయం అత్యవసరంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరూ... ఎల్ అండ్ టీ ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. దీని తర్వాత, ఎల్ అండ్ టీ ఎండీ వీబీ గాడ్గిల్ తో సమావేశమవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. వీబీ గాడ్గిల్ తో జరిపే సమావేశంలో హైదరాబాద్ మెట్రోరైల్ పై ఓ స్పష్టమైన అవగాహనకు రావాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని సెక్రటేరియట్ వర్గాలు అంటున్నాయి. ఎల్ అండ్ టీ లేఖ రాసిన విషయం నిజం కాదని టీఆర్ఎస్ వర్గాలు అంటుండగా... తాము లేఖ రాసిన విషయం నిజమేనని ఎల్ అండ్ టీ ప్రతినిధులు సెక్రటేరియట్ లో మీడియాకు తెలిపారు.