: చంద్రబాబుతో పాటు టీడీపీలో మరో కొత్త 'హీరో'
హీరో మోటార్స్ సంస్థ దక్షిణాదిన తన తొలి ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకునే అంశంలో చంద్రబాబుతో పాటు టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు కూడా 'హీరో'పాత్ర పోషించారు. ఆయన చేసిన మంత్రాంగం వల్లే హీరో ప్లాంట్ ఏపీకి దక్కిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల హీరో సంస్థ దక్షిణాదిలో తమ ప్లాంట్ ను పెట్టబోతుందని ప్రకటించగానే... తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాలు కూడా 'హీరో'ను సొంతం చేసుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డాయి. తొలుత ఈ రేసులో ఏపీ వెనుకబడినట్టు అనిపించడంతో... వెంటనే చంద్రబాబు కంభంపాటిని రంగంలోకి దించారు. చంద్రబాబు ఆదేశాలతో కంభంపాటి చురుగ్గా వ్యవహరించి హీరో ప్లాంట్ ఏపీకి దక్కేలా 'చక్రం' తిప్పారు. దీంతో, పాటు చంద్రబాబు కూడా తన పరపతిని ఉపయోగించి... అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హీరో సంస్థకు హామీ ఇవ్వడంతో... ఆఖరికి 'హీరో' ఏపీ సొంతమయ్యింది. 1986 నుంచి కంభంపాటి 'హీరో'కు ఏపీ డీలర్ గా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీ ప్రస్తుత చైర్మన్ పవన్ కాంత్ ముంజాల్ తో కంభంపాటికి సుదీర్ఘకాలంగా వ్యక్తిగత సంబంధాలున్నాయి. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా సమర్థంగా పనిచేస్తూ... కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా కంభంపాటి మంచి పరపతిని సంపాదించుకున్నారు.