: పాదాభివందనం ఎందుకు వద్దంటున్నారు?: విశాఖలో పీఠాధిపతులను ప్రశ్నించిన మోహన్ బాబు
నిన్న రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 20 ఆలయాలకు చెందిన అర్చకులను విశాఖపట్నంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు, సినీనటులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దిక్కుమాలిన రాజకీయరంగంలో ఉన్నప్పటికీ సుబ్బరామిరెడ్డి ఏనాడూ ఆ రంగు పులుముకోలేదని శారదా పీఠాధిపతి స్వరూపానంద ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు మోహన్ బాబు తనదైన శైలిలో ప్రసంగించారు. సుబ్బరామిరెడ్డి నిరాడంబరుడని... తాను ఆయనను 'ధర్మరాజు', 'కళాబంధు' అని పిలుస్తాననీ అన్నారు. ఈ సందర్భంగా, స్వామీజీలను ఉద్దేశించి మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. స్వామీజీలు, పీఠాధిపతులు ఎంతో కష్టపడి తపస్సు చేసి శక్తిని సంపాదిస్తారని... తీరా తనలాంటి భక్తులు పాదాలను తాకాలని ముందుకు వంగితే వారు వాటిని వెనక్కి తీసుకుంటారనీ అన్నారు. తాము అంటరానివారం కాదని... తాము ముట్టుకుంటే శక్తి పోతుందంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడిగినందుకు తనను వేరే విధంగా అనుకోవద్దని మోహన్ బాబు పీఠాధిపతులను కోరారు.