: మీకో నమస్కారం... హైదరాబాద్ మెట్రోరైల్ ను మీరే కట్టుకోండి...మా వల్ల కాదు: ఎల్ అండ్ టీ
‘హైదరాబాద్ మెట్రో రైల్’ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. ఎల్ అండ్ టీ సంస్థకు... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కీచులాటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ 'మీకో నమస్కారం' అని తేల్చి చెప్పింది. 'ప్రాజెక్ట్ నుంచి మేం వైదొలుగుతాం... మీరే నిర్వహించుకోండి' అంటూ సంచలన ప్రతిపాదన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. మెట్రో రైల్ మార్గంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని... దీని వల్ల రోజురోజుకీ తమ మీద విపరీతమైన ఆర్థికభారం పడుతోందని ఎల్ అండ్ టీ మేనేజింగ్ డైరెక్టర్ వీబీ గాడ్గిల్ హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని ఎల్ అండ్ టీ ఆరోపిస్తోంది. దీంతోపాటు హైదరాబాద్ మెట్రోరైల్ వర్గాల వైఖరిపై ఆగ్రహంతో ఎల్ అండ్ టీ సంస్థ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విభజన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోరైల్ మనుగడ కష్టమని ఎల్ అండ్ టీ భావిస్తోంది. రాష్ట్రవిభజన తర్వాత హైదరాబాద్ నగర ప్రాధాన్యతల్లో వచ్చిన అనూహ్య మార్పులతో ప్రాజెక్ట్ తమకు ఆర్థికంగా పెనుభారం అయ్యిందని ఎల్ అండ్ టీ ప్రభుత్వానికి తెలిపింది. కేవలం టిక్కెట్లను విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో హైదరాబాద్ మెట్రో రైల్ ను నిర్వహించలేమని... విభజన తర్వాత హైదరాబాద్ నగరానికి ఇంతకుముందు ఉన్న అవకాశాలు ఇప్పుడు లేవని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. నిర్మాణకర్తగా ఇప్పటి వరకు ఖర్చుపెట్టిన దానితో పాటు చట్టపరంగా రావాల్సినవి తమకు అప్పగిస్తే... ప్రాజెక్ట్ నుంచి వైదొలగడానికి తమకు అభ్యంతరం లేదని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది.