: మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కక్రూపై విచారణ
ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూపై కేంద్రం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కమిషన్ గా వ్యవహరిస్తున్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవిలో ఉన్న కక్రూ, స్థానికంగా ఉండకుండా విధులకు గైర్హాజరవుతున్న విషయంపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం, ఆయన వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, విచారణ బాధ్యతలను డీజీపీ అనురాగ్ శర్మకు అప్పగించారు. అనధికారిక గైర్హాజరీతో పాటు నిబంధనలకు విరుద్ధంగానూ జస్టిస్ కక్రూ వ్యవహరిస్తున్నారని హైకోర్టు న్యాయవాది అజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. అంతేకాక ఓ వర్గం వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కక్రూ, మరో వర్గాన్ని దూరంగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. దీంతో జస్టిస్ కక్రూపై విచారణకు తెరలేచింది. హెచ్ ఆర్ సీ చైర్మన్ గా సకల సౌకర్యాలు అనుభవిస్తున్న కక్రూ, నిత్యం తన సొంత రాష్ట్రం కాశ్మీర్ లోనే ఉంటారన్న ఆరోపణలున్నాయి.