: సల్మాన్ పై షారూఖ్... షారూఖ్ పై సల్మాన్!
బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. పొరపాటున వీరు కలిసినా, ముక్తసరిగా పబ్లిసిటీ కోసం చేయిచేయి కలిపిన సందర్భాలే ఎక్కువ. దీనికి విరుద్ధంగా సల్లూ భాయ్ షారూఖ్ ను పొగడ్తల్లో ముంచెత్తగా, బాద్షా షారూఖ్ కూడా సల్లూభాయ్ ని ఆకాశానికెత్తేస్తున్నాడు. సల్మాన్ వ్యాఖ్యాతగా ఈ నెల 21 నుంచి కలర్స్ టీవీ ఛానల్ లో 'బిగ్ బాస్ 8' ప్రసారం కానుంది. ప్రతి వారం విడుదలయ్యే బాలీవుడ్ సినిమాలకు ఈ షోలో ప్రచారం కల్పిస్తారు. దీంతో, షో, సినిమా... రెండింటికీ ఆదరణకు ఆదరణ, డబ్బుకు డబ్బు లభిస్తాయి. ఈ నేపథ్యంలో షారూఖ్ కొత్త సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' ప్రమోషన్ ఈవెంట్ ను 'బిగ్ బాస్ 8' వేదికగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో షారూఖ్ ను సల్లూభాయ్ పొగిడేశాడు, షారూఖ్ స్నేహపూర్వకంగా ఉంటాడని, గౌరవంగా మసులుకుంటాడని అన్నాడు. దీనికి ప్రతిగా షారూఖ్ ఖాన్ కూడా సల్లూభాయ్ చాలా గౌరవంగా, స్నేహపూర్వకంగా ఉంటాడని ప్రశంసించాడు. తమను ఎక్కడికి ఆహ్వానించినా, సినిమా ప్రచారం కోసం వెళతామని అన్నాడు. అలాగే 'బిగ్ బాస్ 8' కి కూడా వెళతామని, పొరపాటున వెళ్లకపోతే తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన అభిమానులకు సూచించాడు.