: సీఎం కేసీఆర్ పేషీని వీడాలనుకుంటున్న స్మితా సబర్వాల్
కేసీఆర్ పేషీలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తోన్న స్మితా సబర్వాల్... ఆ పదవి నుంచి పక్కకు తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. సీఎం పేషీకి రాకముందు స్మితా సబర్వాల్ మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేసేవారు. ఆ పదవిలో ఉండగా అక్కడి ప్రజల ఆదరాభిమానాలను ఆమె చూరగొన్నారు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే... స్మితా సబర్వాల్ సమర్థతను గుర్తించి ఆమెను తన పేషీలోకి కేసీఆర్ తీసుకున్నారు. పేషీలో చేరిన తొలినాళ్లలో స్మితాసబర్వాల్ చురుగ్గా వ్యవహరించారు. అయితే, ఇటీవల కాలంలో సీఎం పేషీలో పని ఒత్తిడి కారణంగా ఆమె పిల్లల ఆలనా పాలనపై దృష్టి పెట్టలేక బాధపడుతున్నారని తెలుస్తోంది. తమ పిల్లలిద్దరూ ఆరేడు సంవత్సరాల లోపు వారని... పని ఒత్తిడి కారణంగా వారిని చూసుకోవడం కుదరడం లేదని ఆమె సన్నిహితుల వద్ద వాపోతున్నారు. కొద్ది రోజుల క్రితం తమ పిల్లల్లో ఒకరు స్కూల్లో గాయపడి... ఆసుపత్రిలో చేర్చినప్పుడు కూడా... తాను వారిని సరిగ్గా చూసుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యానని ఆమె సన్నిహితుల దగ్గర ఆవేదన చెందుతున్నారు. దీంతో పిల్లల సంరక్షణ కోసం... సీఎం పేషీని వదిలి మరో పోస్టింగ్ కు వెళ్లాలని ఆమె ఆలోచిస్తున్నట్టు సమాచారం.