: తండ్రి సచిన్ పేరిట టోర్నీలో తనయుడు అర్జున్
భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ కు ఎన్ని పేర్లో..! క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్, బ్యాటింగ్ మ్యాస్ట్రో... ఇలా ఎన్నో! తాజాగా, ముంబయిలో సచిన్ పేరిట ఓ జూనియర్ స్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. దీనిపేరు మాస్టర్ బ్లాస్టర్ స్కూల్ క్రికెట్ చాంపియన్ షిప్. ఈ టోర్నీలో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా పాల్గొంటుండడం విశేషం. ఈ టోర్నీలో అర్జున్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బాలుర, బాలికల విభాగంలో అండర్-14, అండర్-16 కేటగిరీల్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో నాకౌట్ పద్ధతిలో పోటీలు ఉంటాయి. టోర్నీ విజేతకు సచిన్ టెండూల్కర్ బహుమతి ప్రదానం చేయనున్నాడు. సోమవారం ప్రారంభమైన ఈ ఇంటర్ స్కూల్ చాంపియన్ షిప్ సెప్టెంబర్ 20 వరకు జరుగుతుంది.