: హైదరాబాద్ శివార్లలో యువతి కిడ్నాప్ యత్నం, ఆటో బోల్తాతో విఫలం
హైదరాబాద్ మహా నగర శివార్లలో సోమవారం రాత్రి ఓ మహిళను అపహరించే యత్నం జరిగింది. అయితే నిందితుడు వినియోగించిన ఆటో బోల్తా పడటంతో మహిళ మృగాళ్ల బారి నుంచి తృటిలో తప్పించుకుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం పటాన్ చెరు, ఇస్నాపూర్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. పటాన్ చెరు పరిధిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ, సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత విధులు ముగించుకుని ఇస్నాపూర్ లోని తన నివాసానికి వెళ్లేందుకు అటుగా వెళుతున్న ఓ ఆటో ఎక్కింది. మహిళ ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్, ఆటో నడుపుతూనే ఫోన్ లో తన స్నేహితులకు సమాచారాన్ని చేరవేశాడు. అంతేకాక, ఆటోను ఇస్నాపూర్ వైపు కాకుండా, ఔటర్ రింగు రోడ్డు మీదుగా మళ్లించాడు. ఈ క్రమంలో మహిళ అతడి యత్నాన్ని అడ్డుకున్న నేపథ్యంలో ఆటో వేగాన్ని మరింత పెంచాడు. దీంతో ఆటో అదుపు తప్పి, బోల్తా పడింది. ఆటో బోల్తా పడటాన్ని గుర్తించిన పోలీసులు, పరుగున అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ మహిళ, నిందితుడిని ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు. అయితే ఆటో డ్రైవర్, తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని మహిళ చెప్పడంతో అతడిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.