: నేడే ఉప ఎన్నికల ఫలితాలు!


తెలుగు రాష్ట్రాల్లోని మెదక్ పార్లమెంట్, నందిగామ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన మరో 2 పార్లమెంట్, 32 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై కేంద్రంలో అధికార పార్టీ బీజేపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. వడోదర పార్లమెంట్ స్థానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఖాళీచేసిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ స్థానాన్ని ఎలాగైనా తిరిగి కైవసం చేసుకోవాలని బీజేపీ శతథా యత్నించగా, అటు కాంగ్రెస్ కూడా తమ సత్తా చాటేందుకు సర్వ శక్తులనూ ఒడ్డింది. సాధారణంగా వడోదరలో బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఓట్ల లెక్కింపుపై ఇరు పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇర తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ఖాళీ చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్టీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డిని టీఆర్ఎస్ బరిలో నిలిపింది. టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ, టీడీపీ జట్టుకట్టి ఉమ్మడి అభ్యర్థిగా జగ్గారెడ్డిని బరిలో నిలిపాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లాలో మంచి పలుకుబడి ఉన్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పోటీకి దిగారు. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ స్థానంలో టీఆర్ఎస్ కే విజయావకాశాలున్నప్పటికీ, బీజేపీ కూడా బలంగానే శ్రమించిన నేపథ్యంలో తనకు గెలుపు అవకాశాలు లేకపోలేదని భావిస్తోంది. ఇక నందిగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన తంగిరాల ప్రభాకరరావు మరణించిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని బరిలోకి నిలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతిపక్ష వైసీపీ మాత్రం బరికి దూరంగా ఉంది. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం దాదాపుగా ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ నందిగామలో 11 గంటలకంతా పూర్తి కానుంది. మెదక్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు మధ్యాహ్ననికి గాని పూర్తి కాదు.

  • Loading...

More Telugu News