: కాశ్మీర్ వరదలతో ఢీలా పడిన క్రికెట్ బ్యాట్ల పరిశ్రమ
జమ్మూకాశ్మీర్ రాష్ట్రం వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు నిరాశ్రయులు కాగా, పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి. అలా నష్టపోయిన పరిశ్రమల్లో విల్లో కలప పరిశ్రమ ఒకటి. ఇక్కడ లభించే విల్లోతో క్రికెట్ బ్యాట్లు తయారుచేస్తారు. భారత్ లోని కొన్ని బ్యాట్ల కంపెనీలు ఖరీదైన ఇంగ్లీష్ విల్లో కంటే దేశీయంగా లభించే కాశ్మీర్ విల్లోకే ప్రాధాన్యత ఇస్తాయి. ఇప్పుడు వరదల కారణంగా కోట్ల విలువైన విల్లో కలప దెబ్బతినడంతో... మీరట్, జలంధర్ నగరాల్లో ఉన్న బ్యాట్ల తయారీ పరిశ్రమలకు ముడి కలప కొరత ఏర్పడింది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి బ్యాట్ల ధరల పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. జాతీయ క్రికెటర్లు, రంజీ స్టార్లు ఖరీదైన ఇంగ్లీష్ విల్లోతో తయారైన బ్యాట్లు వాడతారని, కాశ్మీర్ వరద ప్రభావం వారిపై ఉండకపోవచ్చని... కాశ్మీర్ విల్లోతో తయారయ్యే బ్యాట్లు వాడే వర్ధమాన క్రికెటర్లు కొత్త బ్యాట్లు కొనాలంటే అధికమొత్తం వెచ్చించాల్సి ఉంటుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. భారత్ లో ప్రముఖ క్రికెట్ ఉపకరణాల తయారీదారు 'ఎస్జీ' సంస్థ మార్కెటింగ్ విభాగం డైరక్టర్ పరాస్ ఆనంద్ మాట్లాడుతూ, కలప యార్డుల్లో ఉన్న విల్లో చెక్కలు వరదల కారణంగా కొట్టుకుపోయాయని, దెబ్బతిన్నాయని తమకు సమాచారం అందినట్టు తెలిపారు. బ్యాట్ల తయారీ పరిశ్రమకు ఇది దుర్వార్త అని పేర్కొన్నారు.