: నా జన్మదిన వేడుకలు జరపొద్దు: మోడీ
తన జన్మదిన వేడుకలను నిర్వహించవద్దని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరిన ఆయన తన జన్మదినం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ ప్రజలకు సహాయం చేయాలని కోరేందుకు ట్విట్టర్లో తన అభ్యర్థనను పోస్ట్ చేసిన సందర్భంగా మోడీ, తన జన్మదినాన్ని కూడా ప్రస్తావిస్తూ, ఆడంబరాలను మాని ఆపదలో ఉన్న వారికి సహాయంగా నిలిచేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ నెల 17న తన జన్మదినాన్ని పురస్కరించుకుని తన స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామంటూ కోరారని, అయితే తాను వారిని వారించానని చెప్పారు. తన జన్మదిన వేడుకలకు ఖర్చుచేసే మొత్తాన్ని కాశ్మీర్ వరద సహాయంగా అందజేయాలని మోడీ విజ్ఞప్తి చేశారు.