: ముంబయి ఇండియన్స్ ఓటమి... లాహోర్ లయన్స్ విజయభేరి
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ క్వాలిఫయింగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంప్ ముంబయి ఇండియన్స్ ఓటమిపాలైంది. పాకిస్థాన్ దేశవాళీ జట్టు లాహోర్ లయన్స్ తో రాయ్ పూర్ లో గతరాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసింది. యువ బ్యాట్స్ మన్ ఆదిత్య తారే (37) ఆ జట్టులో టాప్ స్కోరర్. వెటరన్ మైక్ హస్సీ 28 పరుగులు చేయగా, కెప్టెన్ పొలార్డ్ (6) నిరాశపరిచాడు. అనంతరం, లక్ష్యఛేదనలో లాహోర్ లయన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 139 పరుగులు చేసి విజయభేరి మోగించింది. పాక్ జాతీయ జట్టు ఆటగాడు ఉమర్ అక్మల్ (38*) లయన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ షెహ్ జాద్ 34 పరుగులతో రాణించాడు. ముంబయి బౌలర్లలో ఓజా 2 వికెట్లు తీయగా, ఆదుకుంటాడనుకున్న 'యార్కర్ స్పెషలిస్ట్' మలింగ ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు.