: బతుకమ్మ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించని కేసీఆర్... వివాదస్పదమవుతున్న నిర్ణయం
బతుకమ్మ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించకపోవడంపై టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్ పై మండిపడుతున్నారు. సోనియా పట్టుదల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని...కనీసం ఆ కృతజ్ఞత కూడా కేసీఆర్ కు లేదన్నారు. గతంలో సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని... ఆమె దేవత అని ప్రశంసల వర్షం కురిపించిన కేసీఆర్... ఇప్పుడు ఆమెను కనీసం బతుకమ్మ వేడుకలకు పిలవకపోవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణకు మద్దతు తెలపని మహిళా ముఖ్యమంత్రులను, ఎంపీలను కూడా కేసీఆర్ బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించారని... ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియాను మాత్రం ఆయన ఆహ్వానించలేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆవేదన చెందారు. తెలంగాణ సంస్కతికి దర్పణమైన బతుకమ్మ పండుగకు అతిథులుగా... మహిళా ముఖ్యమంత్రులు జయలలిత, మమతా బెనర్జీ, ఆనందీ బెన్ లతో పాటు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్... కేంద్ర మహిళామంత్రులు, మహిళా గవర్నర్ లు,.... కిరణ్ బేడీ, మేథాపాట్కర్, అరుంధతీ రాయ్ లాంటి ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరగనున్న ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేసీఆర్ రూ.10కోట్లను కేటాయించారు. అయితే ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని ఆహ్వానించకపోవడం వివాదస్పదమవుతోంది.