: విశాఖలో వీడని బాలుడి కిడ్నాప్ మిస్టరీ
విశాఖ జిల్లాలో ఐదు రోజుల క్రితం కిడ్నాప్ నకు గురైన బాలుడు దామోదర్ మిస్టరీ ఇంకా వీడలేదు. దామోదర్ ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాస్ కుమారుడైన దామోదర్ ను ఐదు రోజుల క్రితం అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు, రూ. 30 లక్షలిస్తేనే బాలుడిని ప్రాణాలతో వదిలిపెడతామని బెదిరించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీనివాస్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా శనివారం కిడ్నాపర్లు బాలుడి ఫొటోలను విడుదల చేశారు. మరోవైపు దీనిపై కూపీ లాగుతున్న పోలీసులు, 24 గంటల్లోగా నిందితులను పట్టుకోవడంతో పాటు బాలుడిని రక్షిస్తామని చెబుతున్నారు. డీఎస్పీ రాంగోపాల్ నేతృత్వంలో పోలీసు బృందాలు కిడ్నాపర్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. శ్రీనివాస్ కు తెలిసిన వారే ఆయన కొడుకును కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.