: ఈసారైనా మోడీ మంత్రం పనిచేసేనా?
శనివారం దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లోనైనా ప్రధాని మోడీ మంత్రం పనిచేస్తుందా? లేదా? అన్న విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెలలో నాలుగు రాష్ట్రాల పరిధిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన మేర ఫలితాలు రాలేదు. తాజాగా శనివారం దేశంలోని తొమ్మిది రాష్ట్రాల పరిధిలోని మూడు పార్లమెంట్, 33 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది. మూడు పార్లమెంట్ స్థానాల్లో, మోడీ ఖాళీ చేసిన వడోదర సీటు కూడా ఉంది. వారణాసి, వడోదరల్లో పోటీ చేసిన మోడీ, రెండు చోట్లా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే వారణాసిని అట్టిపెట్టుకుని వడోదరకు మోడీ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజ్ బెన్ భట్టా, కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రావత్ తో పోటీ పడుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ ఖాళీ చేసిన మెయిన్ పురి స్థానంపైనా అందరి దృష్టి నిలిచింది. తాను ఐదు పర్యాయాలు గెలిచిన ఈ స్థానం నుంచి తన మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను ములాయం బరిలో నిలిపారు. ఇక తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలపైనా ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖాళీ చేసిన నేపథ్యంలో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరుగుతోంది. బీజేపీ అభ్యర్థిగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఉప ఎన్నికలు జరగుతున్న అన్ని స్థానాలు ప్రముఖులు ఖాళీ చేసినవే అయిన నేపథ్యంలో వీటిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.