: వేలానికి లండన్ లోని అంబేద్కర్ ఇల్లు... కొనుగోలు చేయమంటున్న కాంగ్రెస్ నేత
లండన్ లో ఒకప్పుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివసించిన ఇంటిని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నేత, ప్రస్తుత మహారాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ కేంద్రాన్ని కోరుతున్నారు. లండన్ లోని కింగ్ హెన్రీ రోడ్ లో 2,050 చదరపు అడుగులున్న ఆ ఇల్లు దాదాపు రూ.40 కోట్ల వరకు ధర పలుకుతుందని చెప్పారు. 1921-22 సంవత్సరాల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదువుకున్న అంబేద్కర్ ఆ ఇంట్లోనే ఉండేవారని మంత్రి తెలిపారు. ఇప్పుడు దాన్ని వేలానికి పెట్టినట్లు లండన్ లోని 'ద ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరైటిస్ అండ్ బుద్దిస్ట్ ఆర్గనైజేషన్' (ఎఫ్ఏబీఓ) మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లేఖ రాశారని మంత్రి రౌత్ వెల్లడించారు. తనకు అంబేద్కరైటిస్ సంఘాలతో సంబంధం ఉండటంతో వాళ్లు తనను సంప్రదించి సదరు ఇంటిని అమ్మేందుకు సాయం చేయాలని కోరినట్లు వివరించారు. ఇప్పుడదొక చారిత్రక స్థలమన్న ఆయన మనం కొనేందుకు మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు.