: శ్రీనగర్ వైద్యుల చిత్తశుద్ది... మందులివ్వండి చాలు తంటాలు పడతాం
విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ భారతీయత పెల్లుబుకుతోంది. చేయిచేయి కలిపి ఒకరికి ఒకరు తోడుగా విపత్తులను ఎదుర్కొనేందుకు సంసిద్ధులవుతున్న తీరు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. అంతవరకు ఉన్న పరిస్థితులను మరచిపోయి చేతనైనంత సాయం చేయడానికి అందరూ సహకరిస్తోన్న తీరు అబ్బురపరుస్తోంది. విధి వైపరీత్యంతో తల్లడిల్లిన జమ్మూకాశ్మీర్ లో వైద్యులు అంతులేని సేవతో తమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో జమ్మూకాశ్మీర్ ను వరదలు ముంచెత్తడంతో శ్రీనగర్ లో పనిచేస్తున్న ఏకైక ఆసుపత్రి అహ్మద్ ఆసుపత్రి. ఇది 20 పడకల సామర్థ్యం కలది. మిగిలిన ఆసుపత్రులన్నీ వరదలో నీటిలో మునగడంతో అక్కడి రోగులను వైద్యులు ఆహ్మద్ ఆసుపత్రికే పంపుతున్నారు. దీంతో నిన్నమొన్నటి వరకు ఒకరిద్దరు రోగులకు ఆపరేషన్ చేస్తే పని పూర్తయిపోయే వైద్యుల చెంతకు ప్రస్తుతం 30 మంది వరకు ఆపరేషన్ కోసం రోగులు వస్తున్నారు. దీంతో ఆసుపత్రిలోని వైద్యులు ప్రజాసేవే పరమావధిగా తరించిపోతున్నారు. వరదల కారణంగా సిబ్బంది సరిపడా లేకపోవడంతో ఆసుపత్రిని శుభ్రం చేసే పని కూడా వైద్యులే చేస్తున్నారు. సరైన సౌకర్యాలు లేని కారణంగా ఇన్ఫెక్షన్ సోకకుండా దుప్పట్లను చించి వైద్యానికి వాడుతున్నారు. ఆసుపత్రి యజమాని డాక్టర్ ఆసిఫ్ ఖాండే పరిస్థితి దారుణం. ఆయనకు సొంత కుటుంబ సభ్యుల ఆచూకీ మూడు రోజులుగా తెలియలేదు. అయినప్పటికీ ఆయన రోగులను వదల్లేదు. తన పని తాను చేసుకుపోయారు. ఇంతలో ఆయన కుటుంబ సభ్యులు పునావాస కేంద్రానికి చేరుకున్నట్టు సమాచారం అందింది. దీంతో ఆయన సహచరులతో కలసి మొక్కవోని దీక్షతో సేవ చేస్తూ ఆపన్నులకు స్నేహహస్తం చాస్తున్నారు.