: ముస్లింల మనోభావాలను దెబ్బతీశాడంటూ సల్మాన్ పై కేసు నమోదు
ఓ వర్గానికి చెందిన వ్యక్తుల మనోభావాలను కించపరిచాడంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై మహారాష్ట్రలోని యావత్మల్ పోలీసులు కేసు నమోదు చేశారు. 'ఆల్ ఇండియా క్వామి తంజీమ్' విదర్భ యూనిట్ అధ్యక్షుడు మహ్మద్ అసిం ఆలీ ఫిర్యాదు మేరకు సెక్షన్ 295(ఏ) కింద కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో అలీ మాట్లాడుతూ, ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకు ఖాన్ కారణమయ్యాడని అన్నాడు. సల్మాన్ నడుపుతున్న 'బీయింగ్ హ్యూమన్' అనే స్వచ్ఛంద సంస్థ కొన్ని నెలల కిందట ముంబయిలో ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేసిందని, అందులో ఓ మోడల్ అరబిక్ పదం 'అల్లా' అని ఉన్న ఓ గౌను ధరించి ర్యాంపుపై క్యాట్ వాక్ చేసినట్లు పేర్కొన్నాడు. దానికి సంబంధించిన వీడియో క్లిప్ ను కూడా ఫిర్యాదుతో పాటు పోలీసులు అందించినట్లు చెప్పాడు. మొదట తాము పోలీసులకు ఈ విషయం చెప్పినప్పుడు వెంటనే కేసు పెట్టలేదని తర్వాత తాము పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేయడంతో ఈరోజు ఉదయం కేసు రిజిస్టర్ చేశారని వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తోంది.