: ఒళ్ళు పెంచిన పాక్ క్రికెటర్లకు ఇక కష్టమే!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆటగాళ్ళ ఫిట్ నెస్ పై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. పీసీబీ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో ఉన్న ఆటగాళ్ళు అడ్డంగా ఒళ్ళు పెంచి, నిర్దేశిత ఫిట్ నెస్ స్థాయిని అందుకోలేకపోతే వారి పారితోషికంలో 25 శాతం కోత విధించనున్నారు. పాక్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ పేసర్ మహమ్మద్ అక్రం దీనిపై మాట్లాడుతూ, కాంట్రాక్టు జాబితాలో ఉన్న ఆటగాళ్ళకు ఈ వారంలో లాహోర్ లో ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపాడు. "జూన్-జులైలో లాహోర్ లో జరిగిన ఫిట్ నెస్ క్యాంపుకు కొనసాగింపుగా తాజా క్యాంపు నిర్వహిస్తున్నాం. ఎన్సీఏ ఫిట్ నెస్ ట్రైనర్లు, కోచింగ్ ప్యానెల్ రూపొందించిన ఫిట్ నెస్ ప్రమాణాలను ఆటగాళ్ళు అందుకోవాల్సి ఉంటుంది" అని అక్రం పేర్కొన్నాడు. ఈ టెస్టుల్లో విఫలమైన ఆటగాళ్ళు 4 నెలల పాటు పారితోషికంలో కోతను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఫిట్ నెస్ పరంగా మంచి ఫలితాలు కనబర్చినవారికి సెంట్రల్ కాంట్రాక్టు పారితోషికంలో 10 శాతం పెంపు ఉంటుందని అక్రం చెప్పాడు.