: హెచ్ఎంటీ వాచ్ లకు ఇక మంగళం!
హెచ్ఎంటీ వాచ్... టైమ్ మేకర్స్ టు ది నేషన్... అది ఒకప్పటి మాట! దేశంలోనే కాక ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రముఖ బ్రాండ్ గా ఖ్యాతిగాంచిన ఈ వాచ్ ల తయారీని నిలిపేయాలని మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రారంభమైన 53 ఏళ్ల తర్వాత హెచ్ఎంటీని మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో సంస్థలో ఉద్యోగులుగా కొనసాగుతున్న 1,105 మంది ఉద్యోగులు ఇకపై రోడ్డున పడనున్నారు. ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన ఈ కంపెనీ, పదేళ్ల క్రితం దాకా బాగానే పనిచేసింది. వరుసగా నష్టాలు పోగవడంతో పదేళ్లుగా కంపెనీ కార్యకలాపాలు నామమాత్రంగా మారాయి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి రూ. 11 కోట్ల ఆదాయంపై రూ. 242 కోట్ల నష్టాలను హెచ్ఎంటీ మూటగట్టుకుంది. దీనిపై యూపీఏ ప్రభుత్వ ఆదేశాలతో అధ్యయనం చేసిన బోర్డ్ ఫర్ రీకనస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, కంపెనీని పునరుద్ధరించాలని సిఫారసు చేసింది. నివేదికనందుకున్న యూపీఏ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. తాజాగా అధికారం చేపట్టిన ప్రభుత్వం, కంపెనీని పునరుద్ధరించాల్సింది పోయి మూసివేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.