: శ్రీకాకుళం వివాహితపై హైదరాబాద్ ఆటోవాలాల దాష్టీకం
ఆటోవాలాల ఆగడాలకు అడ్డుకట్టపడడం లేదు. అవకాశం వస్తే లైంగిక దాడులకు పాల్పడడం హైదరాబాదులో నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా, శ్రీకాకుళానికి చెందిన వివాహితపై హైదరాబాదులో ఓ ఆటో డ్రైవర్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి దారుణానికి తెగబడ్డాడు. మియాపూర్ ఇన్స్పెక్టర్ వెల్లడించిన అంశాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వివాహిత (26) తన అక్క, బావతో కలిసి వినాయకుడి నిమజ్జనం తిలకించడానికి గచ్చిబౌలి అంజయ్యనగర్ లో ఉంటున్న మరో సోదరి వద్దకు వచ్చింది. తరువాత నిన్న సాయంత్రం మాదాపూర్‌లోని శిల్పారామం సందర్శించారు. అక్కడ్నుంచి ఇంటికెళ్లేందుకు రాత్రి 9.30కి శిల్పారామం దగ్గర ఆటో ఎక్కారు. శ్రీకాకుళం యాసను గమనించిన ఆటో డ్రైవర్, కొండాపూర్ వద్ద తన స్నేహితులు ముగ్గురిని ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి హఫీజ్‌పేట్‌లోని నిర్మానుష్య ప్రాంతమైన సర్వే నెంబర్ 77లోకి ఆటోను తీసుకెళ్లి, అక్కాబావలను చితకబాది, వివాహితపై నలుగురూ లైంగికదాడికి యత్నించారు. ఎలాగోలా వీరి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు అంజయ్యనగర్‌లోని సోదరి ఇంటికి చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.