: ఢిల్లీ వాసులకు ఇప్పటికీ 'క్రేజీ'వాలే!
అందివచ్చిన అధికారాన్ని కేంద్రంతో తగవులాట పెట్టుకుని తృణప్రాయంగా వదిలేసిన అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన చేసిన నిర్వాకం కారణంగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అంతేకాక, ప్రభుత్వం ఏర్పాటవుతుందా? కొత్తగా ఎన్నికలు జరుగుతాయా? అన్న విషయంపై ప్రజలతో పాటు ప్రభుత్వ పెద్దలకూ ఓ పట్టాన పరిస్థితి అర్థం కావడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితికి కారణమైన కేజ్రీవాల్ అంటే ఎవరికైనా కోపం రావడం సహజం. కానీ, ఢిల్లీ వాసులకు మాత్రం కోపం రావడం లేదు కదా, ఇప్పటికీ ఆయనే తమ హీరోగా వారు భావిస్తున్నారు. ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో 47 శాతం మంది ఢిల్లీ వాసులు కేజ్రీవాల్ కే ఓటేశారు. అంతేకాక, కేజ్రీవాల్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని వారు వాదిస్తున్నారట. ఇక 42 శాతం మంది మాత్రం ఢిల్లీ పాలన పగ్గాలు బీజేపీ తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగా ఎవరికి ఓటేస్తారని అడిగితే 30 శాతం మంది కేజ్రీవాల్ కే నంటూ చెప్పేశారు. అయితే తిరిగి ఎన్నికలు జరిగితే, ఎవరికి ఓటేస్తారన్న ప్రశ్నకు 41 శాతం మంది మాత్రమే కేజ్రీవాల్ పార్టీ వైపు మొగ్గుచూపారు. బీజేపీకి ఓటేస్తామని 50 శాతం మంది చెప్పారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీని మాత్రం ఆహ్వానించవద్దని 50 శాతం మంది ప్రజలు చెప్పారు.